రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions)
భారతదేశం స్వాతంత్య్రానంతరం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందింది. వయోజన ఓటింగ్ హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ఏర్పడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉంది. రాజ్యాంగ చట్టంలో పొందుపరచబడిన నిబంధనలచే ఇది పరిరక్షించబడుతున్నది. రాజ్యాంగ చట్టంలో కేవలం పరిపాలనా సంబంధమైన అంశాలేకాకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడ ప్రస్తావించడం జరిగింది. దేశంలో విద్యాభివృద్ధి లేనిదే రాజ్యాంగ పీఠికలో ఉదహరించబడిన సమానన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైన వాటికి విలువలేదు. విద్యాభివృద్ధి లేనిదే ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రగతి సాధ్యపడదు. నిరక్షరాస్యులుగా ఉన్న కోట్లాది ప్రజలు అట్టడుగు స్థాయిలోనే ఉంటూ ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడవలసి వస్తోంది. అందువల్ల విద్యాభివృద్ధిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
-అందువల్ల రాజ్యాంగంలో విద్యాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ చట్ట ప్రకారం విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ సంబంధించిన అంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యాభివృద్ధికి బాధ్యత వహించవలసి ఉన్నది. రాజ్యాంగం 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరకూ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించేందుకు కట్టుబడింది.
భారత రాజ్యాంగంలో పరిపాలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సంబంధించిన విషయాల నిర్దేశక సూత్రాలతోబాటు విద్యాభివృద్ధిని సూచించే విధానాన్ని కూడా రాజ్యాంగం నిర్ధేశించింది. విద్యా విషయక హక్కు కూడా దేశంలోని పౌరులందరికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు ప్రజాప్రభుత్వంలో జాతి, మత, కుల, తెగ, లింగ వివక్ష లేకుండా ప్రతి వ్యక్తి విద్యను పొందే హక్కును కలిగి ఉండాలి. సార్వత్రిక ప్రాథమిక విద్యాహక్కును 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నం చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో ప్రవేశపెట్టారు. ప్రాథమికవిద్య పిల్లల భౌతిక, మానసిక, ఉద్వేగ, వివేక, సాంఘిక అభివృద్ధికి పునాదిదశ. నిర్బంధ ప్రాథమిక విద్యకు రాజ్యాంగపరమైన సదుపాయాలు అనేకం పొందుపరిచారు. వాటిలో ముఖ్యమైనవి.
- ఆర్టికల్ 29, 30 - మైనారిటీలకు విద్యాసంస్థలను స్థాపించి నడిపేహక్కు
- ఆర్టికల్ 350 (ఎ) - ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన సదుపాయాలు
- ఆర్టికల్ 46 - SC, ST, బలహీన వర్గాలకు విద్యా, ఆర్థిక సహకారం
- ఆర్టికల్ 15 (1), (3), 16(1) - స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం.