1921 తరవాత కాలంలో ప్రాథమిక విద్య - Primary education after 1921
1921 సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడమైనది. నిర్బంధ ప్రాథమిక విద్యను త్వరితంగా అభివృద్ధి చేయవచ్చుననీ, ఇది ప్రాథమిక విద్య సార్వజనీకరణకు నాంది పలుకుతుందనీ ఆశించడమైనది. కాని ఫలితాలు ఆశించిన వాటికి విరుద్ధంగా ఉండటంవల్ల 1929లో హార్టాగ్ కమిటీని నియమించి పరిస్థితిని అంచనా వేయవలసిందిగా ఆదేశించారు. ఈ కమిటీ స్థానిక సంస్థలు అనుభవం లేనివనీ, ఫలితంగా స్థబ్ధత చోటుచేసుకున్నట్లుగా అంచనా వేశారు. అందువల్ల స్థానిక సందర్శించి తనిఖీని నిర్వహించి విద్యా ప్రగతికి అవసరమయ్యే సౌకర్యాల కోసం అధికారులతో తరచుగా చర్చించేటట్లు తగిన చర్యలు తీసుకొనవలసినదిగా సిఫారసు చేశారు.
1937లో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రాంతాలవారీగా నిర్బంధ విద్యకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిధులను సమకూర్చారు. 1937లో వార్థాలో మహాత్మాగాంధీ బేసిక్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కాని 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తి విద్యాప్రగతి కుంటుపడింది. 1947లో బ్రిటీషు పాలన ముగిసేనాటికి మనదేశంలో ఉన్న విద్యాపరిస్థితి ఈ విధంగా ఉంది.
- దేశంలో జాతీయ విద్యా విధానం లేదు.
- సెకండరీ, ఉన్నత విద్యలో ఆంగ్లభాష ఎక్కువగా అమలులో ఉండేది.
- విద్యారంగానికి ఒక ప్రణాళికకాని, ఆశయాలుకాని లేవు..
- సామాజిక అవసరాలకు విద్యా లక్ష్యాలకు ఎలాంటి సంబంధం లేకుండా లక్ష్యాలను నిర్ణయించారు. కళాశాలలు డిగ్రీలు ఇచ్చే కర్మాగారాలుగా మారాయి.