విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education)
- శబ్దశాస్త్రమును అనుసరించి "ఫిలాసఫీ” అనే పదం 'ఫిలోస్' (philos), 'సోఫియా (sophia) అనే రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది.
- 'ఫిలోస్' అనగా ప్రేమ (love) అని 'సోఫియా' అంటే జ్ఞానం (wisdom) అని అర్థం.
- ఫిలాసఫి అంటే సంపూర్ణార్ధంలో జ్ఞానపిపాస (Love of wisdom) అని అర్థాన్ని ఇస్తుంది.
తత్వశాస్త్రాన్ని దర్శనశాస్త్రం అన్ని కూడ అంటారు. ఇది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. తత్వశాస్త్ర పరమలక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి. అవి :
1. ఆస్తికవాదం - దేవుని ఉనికిని అంగీకరిస్తుంది.
2. నాస్తిక వాదం - దేవుని ఉనికిని అంగీకరించదు.
ఆస్థికవాదంలో ఆరు విభాగాలున్నాయి. ఇవి వేద ప్రామాణీకాలు వీటిని "షడ్జర్శనాలు”అని కూడా అంటారు. అవి :
1. మీమాంస - కర్మకాండను ప్రతిపాదించేవి
2. వేదాంత - జ్ఞానకాండను ప్రతిపాదించేవి
3. సాంఖ్య
4. యోగ
5. న్యాయ
6. వైశేషకాలు
నాస్థికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు ముఖ్యమైనవి.
తత్వశాస్త్రం - ప్రధాన విభాగాలు
తత్వశాస్త్రంలో ప్రధాన శాఖలు తొమ్మిది ఉన్నాయి. అవి :
1. ఆది భౌతిక శాస్త్రం (Metaphysics)
2.జ్ఞాన మీమాంస (Epistomology)
3. నీతి శాస్త్రం (Ethics)
4.ఆధ్యాత్మిక తత్వశాస్త్రం (Spritual Philosophy)
5. తర్కశాస్త్రం (Logic)
6.సౌందర్యశాస్త్రం (Aesthetics)
7. విలువల శాస్త్రం (Values)
8. రాజనీతి శాస్త్రం (Politics)
9. మనస్తత్వ శాస్త్రం (Psychology).
విద్య - తాత్విక మూలాధారాలు
మానవుడు అనాదిగా తన మేధాసంపత్తితో స్వీయాధిక్యతను చాటుతూనే ఉన్నాడు. అనాదిగా తన చుట్టూ ఉన్న పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన అనుకూలమైన వ్యవస్థను నిర్మించుకుంటూ, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ, జీవనం సాగిస్తున్నాడు. ఈ పయనంలో ఒకవైపు నుంచి మానవ సమాజంలోను మరోవైపు ఆధ్యాత్మిక విషయాలైన జీవాత్మ పరమాత్మ సంబంధాలను తర్కించుకుంటూ వస్తున్నాడు. ఈ మానవుని అన్వేషణను తత్వశాస్త్రమనవచ్చు. తత్వశాస్త్రమంటే క్రమశిక్షణతో, అప్రమత్తతతో, నిశిత పరిశీలనతో మానవుడు తన సందేహాలకు, సమస్యలకు కనుగొన్న పరిష్కారాల అధ్యయనమేనని చెప్పడం సబబుగా ఉంటుంది. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లేటో (plato) ఈకింది ప్రశ్నలకు జవాబులు పొందడమే తత్వశాస్త్ర లక్ష్యమని అన్నారు.
మన చుట్టూ కనిపించే భౌతిక ప్రపంచమేమిటి? దీని సృష్టికర్త ఎవరు? దీనికి సారధ్యం వహించేవారెవరు? మానవుడు ఎక్కడినుండి జన్మించాడు? ఈ జీవనం వల్ల కలిగే ప్రయోజనమేమిటి? మృత్యువు తరువాత మానవుడెక్కడికి వెళుతున్నాడు? మళ్లీ మళ్లీ జన్మ ఉంటుందా. 'జగత్తు మిథ్య, బ్రహ్మ పదార్థమొక్కటే సత్యం' అనే వాదంలో సత్యమెంత? అసలు వాస్తవికత (Reality) అనేది ఏది? శాశ్వతం అని దేన్ని అనాలి? మంచి చెడుల ఆంతర్యమేమిటి? విజ్ఞానం. అంటే ఏమిటి? సుఖదుఃఖాలు ఏమిటి?
ఇలా వెళుతుంటే ప్రశ్నలకు అంతున్నట్లు తోచదు. ఈ ప్రశ్నలు ప్లేటో కాలం నుంచి నేటివరకు వేదాంతులు యోచించి సరైన జవాబులు కనుగొన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని విషయాలలో వేదాంతులు ఏకీభవించినా అనేక విషయాలలో వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్వేషణకు అంతం కానరాదు. సరైన జవాబులు అందుబాటులో కానరావు.
తత్వశాస్త్రానికి, విద్యకు ఉన్న సంబంధం (Relationship between philosophy. and Education).
“వాస్తవికతను తెలుపునది, విజ్ఞానమందించునది, విలువలు తెలుపునదీ తత్వం" అని అన్నారు. విద్య ఒక లక్ష్యంతో కూడిన ప్రక్రియ. తత్వంలేకున్న విద్య లక్ష్యంలేని పని అవుతుంది. గమ్యంలేని ప్రయాణంగా రూపొందుతుంది. తత్వశాస్త్రం పునాదిలేని విద్య వృధా అని, విద్యచే ప్రభావితం కానితత్వం నిష్ప్రయోజనమని విజ్ఞులు అంటారు. (Education without philoso phy is blind and philosophy without Education is invalid) అలాగే తత్త్వం, విద్య ఒక నాణానికి ఇరుపక్కల అనికూడా అంటారు. తాత్విక సూత్రాలన్ని విద్యాలయాల్లో పరీక్షించబడతాయి. తత్త్వం లక్ష్యం లేక గమ్యం అయితే, విద్య దాన్ని సాధించు సాధనం లేక పంథా.
స్పెన్సర్ ఉద్దేశ్యంలో నిజమైన విద్య, విద్యాతత్వవేత్తలకే సాధించవీలవుతుంది. తత్వశాస్త్రం జ్ఞానపిపాసను గురించి అధ్యయనం చేస్తే, విద్య జ్ఞానాన్ని తరతరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది. తత్వశాస్త్రం మానవ జీవిత పథనిర్దేశకమయితే, విద్య ఆ పథనిర్మాణాన్ని చేపడుతుంది. ఈ భావనని పరిశీలిస్తే విద్యను అనువర్తిత తత్వశాస్త్రం (applied philosophy) అనికూడ అనవచ్చు. కాల్పనికాలుగా (speculative) ఉండే తత్వశాస్త్ర విధానాలు విద్యద్వారా ఆచరణాత్మకాలు (practical)గా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి విద్యను తత్వశాస్త్ర చైతన్యరూపం (Dynamic side of philosophy) అని కూడ వ్యవహరిస్తారు. రస్సెల్ అభిప్రాయంలో విద్య అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వం". కాబట్టి విద్య, తత్వశాస్త్రం రెండూ పరస్పరం విడదీయరాని, విడదీయలేని సంబంధాలు ఉన్న అంశాలుగా భావించవచ్చు.
విద్య-తాత్త్విక శాస్త్ర లక్షణాలు (Characteristics of philosophy)
- తత్వశాస్త్రం ఒక జీవిత విధానం.
- తత్వశాస్త్రం అన్ని కళలకు, విజ్ఞాన శాస్త్రాలకు మాతృమూర్తి
- తత్వశాస్త్రం గతిశీల జీవనశక్తి.
- తత్వశాస్త్రం అతి పురాతనమైన అసలైన అభ్యసన విషయం.
- తత్వశాస్త్రం అతి సత్యం, వాస్తవికతలను అన్వేషిస్తుంది.
- తత్వశాస్త్రం పరిశోధన పద్ధతిని అనుసరిస్తుంది.
- తత్వశాస్త్రం తార్కికమైంది. అన్ని విద్యలకు సంబంధించింది.