విద్య- పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు (Westerm concept of Education)
విద్య అనే పదం “విద్” అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. 'విద్' అంటే తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి. కాబట్టి విద్య అంటే వీటన్నింటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానం అని చెప్పగలం.
విద్యకు సమానార్థం ఉన్న ఆంగ్లపదం "Education- ఎడ్యుకేషన్" లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ (ఎడ్యుసిడ్) అనే పదాల నుంచి పుట్టింది.
ఎడ్యుకేషన్లోని 'E' అంటే out of అని 'duco' అంటే వృద్ధిలోకి తీసుకురావటం (To bringup) అనే అర్థం వస్తుంది. దారి చూపటం (To lead forth) అనే భావాన్ని ఇస్తుంది.
జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణేకాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవనస్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం అని చెప్పవచ్చు, అప్పుడే అది విజ్ఞానమవుతుంది.
- “తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య" - సోక్రటీస్
- "సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్ధ్యాన్ని కలిగించేదే విద్య" - ప్లేటో
- “దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య" - అరిస్టాటిల్
- "మనుషులను సార్ధకులుగా తయారుచేసేదే విద్య" - కొమినియన్
- “సహజమైన, సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. - పెస్టాలజీ
- "జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య" - ఫ్రోబెల్
- “శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి -సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య" - టి.పి.సన్
- "తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకలశక్తి సామర్ధ్యాలను వికాసం చెందించేదే విద్య" - జాన్ డ్యూయీ
- “మనస్సును నియంత్రించటమే విద్య" - ఎమర్సన్
- వ్యక్తి ఆలోచనశక్తిని పెంపొందించేది సరైన విద్య - డెక్టార్
- "సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచటమే విద్య " - స్పెన్సర్
- "పరిణతి చెందిన వారు పరిణతి చెందనివారిపై చూపు ప్రభావమే విద్య" - రెడీన్
- "రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన . వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య' - పాలో ప్రిమరి
పైన తెలిపిన పాశ్చాత్య తాత్వికవేత్తల నిర్వచనాల సారాన్ని సంగ్రహంగా పరిశీలిస్తే "విద్య" సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ నిర్వచనాలు ఎక్కువగా ఆచరణాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా గ్రహించవచ్చు.
విద్య లక్ష్యం కేవలం వ్యక్తి అంతర్గత శక్తులను వెలికితీయడంకాదు, ఆ అంతర్గత శక్తులను ఎలాఉపయోగించాలో కూడా తెలుపుతుంది. ఈ నిర్వచనాలలో కొన్ని ఆధ్యాత్మికతలను పెంపొందిస్తున్నప్పటికిని కొన్ని భౌతికతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆ విద్యద్వారా భౌతిక సంపద సృష్టికి (creativity/productivity) మార్గం చూపుతున్నదని తెలుస్తున్నది.